![]() |
పాతరోజుల్లో హీరోలు సంవత్సరానికి లెక్కకు మించిన సినిమాలు చేసేవారు. ఈ విషయంలో కృష్ణకు ఒక రికార్డు ఉంది. 1972 సంవత్సరంలో ఆయన నటించిన 18 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆ సంవత్సరం ఒకే నెలలో రెండు, మూడు సినిమాలు రిలీజ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతేకాదు, ఒకేరోజు రెండు సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. అలా ఎన్టీఆర్, బాలకృష్ణ వంటి హీరోల సినిమాలు కూడా విడుదలయ్యాయి. కానీ, ఒక డైరెక్టర్ చేసిన రెండు సినిమాలు ఒకేరోజు రిలీజ్ అవ్వడం అనేది అంతకుముందు, ఆ తర్వాత కూడా జరగలేదు. ఆ రికార్డు దర్శకుడు కోదండరామిరెడ్డి పేరు మీదే చెక్కు చెదరకుండా ఉంది.
చిరంజీవి హీరోగా, సుహాసిని, రాధ ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘రాక్షసుడు’ చిత్రం, కమల్‌హాసన్, శ్రీదేవి జంటగా నటించిన ‘ఒకరాధ ఇద్దరు కృష్ణులు’ చిత్రం 1986 అక్టోబర్ 2న విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలు ఇవే టైటిల్స్‌తో యండమూరి వీరేంద్రనాథ్ రాసిన నవలల ఆధారంగా రూపొందడం విశేషం. మరో విశేషం ఏమిటంటే.. ఈ రెండు సినిమాలకు ఇళయరాజా సంగీతం సమకూర్చారు. ఒక దర్శకుడు రూపొందించిన రెండు సినిమాలు ఒకేరోజు విడుదల కావడం అనేది ఎప్ప్పుడూ జరగలేదు. అయితే ఈ రెండు సినిమాలూ సూపర్‌హిట్ అయ్యాయి.
ఆ తర్వాత చాలా కాలానికి నందమూరి బాలకృష్ణ నటించిన సినిమాల విషయంలో ఇదే జరిగింది. బాలకృష్ణ, విజయశాంతి జంటగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘నిప్ప్పురవ్వ’, బాలకృష్ణ, రమ్యకృష్ణ, రవీనా టాండన్ ప్రధాన పాత్రల్లో రవిరాజా పినిశెట్టి రూపొందించిన ‘బంగారు బుల్లోడు’ చిత్రాలు 1993 సెప్టెంబర్ 3న విడుదలయ్యాయి. బంగారుబుల్లోడు కంటే ముందుగానే నిప్ప్పురవ్వ చిత్రాన్ని ప్రారంభించారు. బొగ్గు గనుల్లో షూటింగ్ చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగి ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. దీంతో కొన్నాళ్లు షూటింగ్‌ను నిలిపివేశారు.
ఈ కేసుకు సంబంధించి కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. ఆ కేసు పరిష్కారం అయిన తర్వాత రిలీజ్ డేట్‌ని ఎనౌన్స్ చేశారు. అదే డేట్‌కి బంగారు బుల్లోడు కూడా రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రెండు సినిమాలను ఒకేరోజు రిలీజ్ చేశారు. బంగారు బుల్లోడు పెద్ద హిట్ అవ్వగా, నిప్ప్పురవ్వ ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. బాలకృష్ణ, విజయశాంతి కలిసి ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ కొన్ని కారణాల వల్ల నిప్ప్పురవ్వ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా రాలేదు.
![]() |